PRODUCER GURRAPU VIJAY KUMAR : వెండితెరపై అరుదైన బొమ్మ ..మైనావతి

సినిమా అతని ప్రాణం…సినిమా అతని ధ్యానం…సినిమానే అతని సర్వస్వం. ఆయనే అభిరుచిగల నిర్మాత గుర్రపు విజయ్ కుమార్
అభిరుచికి ఆలోచన తోడైంది..వెండితెరపై తన కల సాకారమైంది.

అరుదయిన చిత్రం మైనావతి

ఈ మధ్య రిలీజయి బ్లాక్బస్టర్ హిట్ అయిన బలగం మూవీ చూసారు కదా..ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పాటతో సినిమాను తారాస్థాయికి తీసుకువెళ్ళి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఒక్క పాటతో కథను రక్తికట్టించే విధానానికి దర్శకుడిని శభాష్ అనకుండా ఉండలేరు. ఇదంతా ఒక ఎత్తు అయితే దర్శకుడు చెప్పిన కథను అంగీకరించి సినిమా నిర్మించిన నిర్మాత గొప్పతనం ఎంతైనా ఉంది.
ఒక పాటతో కథను నడిపిస్తేనే మనకు పూనకం వచ్చేస్తే..రెండుగంటల సినిమా కథను ప్రతీ సన్నివేశం కూడా పాటతో లింక్ అయి ఉంటే… ఎన్నో భావోద్వేగాలు ఆ సన్నివేశాల్లో ఉంటే.. ఆ సినిమా ఇంకెలా ఉండాలి.అలాంటి అరుదయిన చిత్రమే మైనావతి.

నిర్మాతగా తొలి చిత్రంతోనే ప్రయోగం చేసిన గుర్రపు విజయ్ కుమార్

కథను వెండితెరపై ఆవిష్కరించడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. పాటలతో కథనాన్ని నడపడం అనేది ఎక్కువగా పౌరాణిక , భక్తిరస, జానపద చిత్రాల్లో కనిపిస్తుంది. సాంఘిక చిత్రాల్లో పాటలతో కథను చెప్పే విధానం చాలా అరుదు. ఈ విషయంలో 15 ఏళ్ల క్రితమే ఓ నిర్మాత ఓ డిఫరెంట్ ఫిల్మ్ నిర్మించారు. బలగం మూవీలోలా ఒక క్లైమాక్స్ పాట మాత్రమే కాదు. ప్రతీ సన్నివేశానికి భావోద్వేగ భరితమైన పాటలతో కథను నడిపించారు. ఆ సినిమానే మైనావతి. గుర్రపు విజయ్ కుమార్, కాటా కృష్ణ ప్రసాద్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమా 2010 జూలై 9 న విడుదలై నేటికి 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మైనావతి చిత్ర విశేషాలు విజయచిత్ర ఈ పేపర్ ప్రేక్షకులకు ప్రత్యేకం.

అభిరుచిగల నిర్మాత గుర్రపు విజయ్ కుమార్

రొటీన్ కు భిన్నంగా

సినిమా అంటే ఆరు పాటలు, ఆరు ఫైట్లు, ..కాస్త కామెడీ..రెండు సెంటిమెంట్ సీన్లు.. మెప్పించే క్లైమాక్స్ ..ఇవే కమర్షియల్ సినిమాకు ప్రధాన సూత్రం. ఇవన్నీ పక్కన పెట్టేసి కథను సరికొత్త కథనంతో నడిపించి జనరంజకమైన చిత్రాన్ని నిర్మించారు గుర్రపు విజయ్ కుమార్. ఆ సినిమానే మైనావతి. కొత్తగా పెళ్ళైన
ఓ సగటు ఆడపడుచు కష్టాలను హృద్యంగా తెరకెక్కించి ప్రేక్షకులతో ఔరా అనిపించుకున్నారు నిర్మాత గుర్రపు విజయ్ కుమార్.
చిత్రలేఖ,అనీల్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా చూడటానికి జానపద సినిమాలా ఉండే పక్కా సాంఘిక చిత్రం.

మైనావతి చిత్ర కథ విషయానికి వస్తె …

అత్తగారి ఆరల్లకు గురయిన మైనావతీ అనే కోడలి జీవితం..ఈ చిత్ర కథ.
ఎన్నో ఆశలతో అత్తారింటికి అడుగుపెట్టిన మైనావతి అడుగడుగునా అత్త వేధింపులకు గురవుతుంది. ఏనాడూ కూడా భర్తకు ఈ విషయం చెప్పదు. కష్టాల కడలిలో ఈ దంపతుల సంసారం అలా సాగుతూ ఉండగా మైనావతి తల్లికాబోతోంది అనే విషయం అత్త జీర్ణించుకోలేకపోతుంది.ఎలాగయినా తన కొడుకుని ఈ మైనావతికి దూరం చేయాలని పన్నాగం పన్ని దాడి చేయిస్తుంది.

ఈ దాడిలో సాక్షాత్తూ ఆ పార్వతీపరమేశ్వరులు మైనావతిని కాపాడతారు. దుండగుల దాడిలో ఇంటికి దూరమైన మైనావతిని ఓ గ్రామంలో ఓ ఇంటివారు ఆశ్రయం ఇస్తారు. భార్య ఎక్కడికి వెళ్ళిందో తెలియక పిచ్చోడిలా మారిపోయి ఇల్లు వదిలి తిరుగుతూ ఉంటాడు మైనావతి భర్త.
నిండు గర్భవతి అయిన మైనావతి పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది
.అదే సమయంలో ఆ ఊరి జమీందారు భార్య కూడా ఓ మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే ..జమీందార్ భార్యకు పుట్టిన మగబిడ్డ కంటే మైనావతికీ పుట్టిన బిడ్డలో రాజసం ఉట్టిపడటంతో మంత్రసాని సలహామేరకు డబ్బుకు ఆశపడి బిడ్డలను తారుమారు చేస్తుంది మంత్రసాని.
ఆ తరువాత బిడ్డలు పెరిగి పెద్దయ్యాక జరిగిన పరిణామాలేంటి? మైనావతి తన భర్త కలిసారా? వేధింపులకు గురిచేసిన అత్త పరిస్థితి చివరకు ఏమయింది?బిడ్డలను తారుమారు చేసిన మంత్రసాని నిజం చెప్పడానికి ఆ పార్వతీపరమేశ్వరులు చేసిన పథకం ఎంటి? అనే విషయాలు చాలా హృద్యంగా తెరేకెక్కించారు.

పాటలతో కథను చెప్పే సరికొత్త సినిమా

వేణుగోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మైనావతి సినిమాకు ప్రదానబలం సంగీతం. రవి అల సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం పాటలతో నిండి ఉండటం విశేషం.ఈ చిత్రానికి కన్న రఘు నందన్ గౌడ్ అందించిన మాటలు, పాటలు మరో ప్రదానబలం. నటీనటులు ఇలాంటి కథలో నటించాలంటే కత్తి మీద సాము లాంటిదే.ప్రతీ సన్నివేశం భావోద్వేగాన్ని పండించింది.

నిర్మాత గురించి ఒక చిన్నమాట


తెలుగు సినీపరిశ్రమలో మైనావతిలాంటి మంచి చిత్రంతో గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడం అభినందనీయం. చాలా చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా సుధీర్ఘ అనుభవంగల గుర్రపు విజయ్ కుమార్ తన అనుభవాన్ని అంతా రంగరించి ఓ డిఫరెంట్ ఫిల్మ్ నిర్మించారు.జానపద పంథాలో సాగే ఈ సాంఘిక చిత్రానికి చక్కని నిర్మాణ విలువలున్నాయి. ఈ చిత్రం విడుదలయి 15 ఏళ్లు గడుస్తున్నా యూట్యూబ్ లో ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. మరోసారి ఈ చిత్ర యూనిట్ కు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నిర్మాత మరియు విజయచిత్ర ఈ పేపర్ ఎడిటర్ గుర్రపు విజయ్ కుమార్ ఇంకా మరిన్ని మంచి చిత్రాలు నిర్మించి ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.

శ్రీనివాస్ నేదునూరి
సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *