PUBLIC TALK TV FILM NEWS : 30 అక్టోబర్ 2025 ఫిల్మ్ న్యూస్

  • బ్రహ్మానందంకు సూర్యకాంతం స్మారక పురస్కారం
  • మాస్ జాతర’తో కొత్త పాయింట్ – భాను భోగవరపు
  • రాజు వెడ్స్ రామ్బాయి’ భావోద్వేగ ప్రేమకథ – వేణు ఊడుగుల
  • సూపర్ స్టార్ కుటుంబం నుంచి కొత్త హీరోయిన్ – జాన్వీ స్వరూప్
  • చిరంజీవిపై దుష్ప్రచారం – సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు

చిరంజీవిపై దుష్ప్రచారం – సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ, దుర్వచనాలు ఉపయోగిస్తున్న వారిపై హీరో చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రత్యేకంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ దూషణకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల కూడా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన ఘటనపై ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి పేరు, ఫోటోలు, గొంతును ఆయన అనుమతి లేకుండా ఎవరూ ఉపయోగించరాదని సిటీ సివిల్ కోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

మాస్ జాతర’తో కొత్త పాయింట్ – భాను భోగవరపు

మాస్ మహారాజా రవితేజ – శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదలకు సిద్ధమైంది. సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. రైల్వే పోలీస్ నేపథ్యంలో సాగిన ఈ కథలో క్రైమ్ సీక్వెన్స్ కొత్తగా ఉంటుందని, రవితేజగారి 75వ చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నదని దర్శకుడు తెలిపారు. “టైటిల్‌ను రవితేజగారే సూచించారు. మాస్ అంశాలతో పాటు కొత్త పాయింట్‌ను చూపించబోతున్నాం. రవితేజ–శ్రీలీల మధ్య సన్నివేశాలు గ్యాంగ్ లీడర్ మూవీలో చిరంజీవి, విజయశాంతిల కెమిస్ట్రీని గుర్తు చేస్తాయి. నవీన్ చంద్ర పోషించిన శివుడి పాత్ర హైలైట్ అవుతుంది” అని భాను భోగవరపు అన్నారు.

బ్రహ్మానందంకు సూర్యకాంతం స్మారక పురస్కారం

హైదరాబాద్‌లో బుధవారం జరిగిన స్వర్గీయ నటి సూర్యకాంతం శతజయంతి పురస్కారాల ముగింపు వేడుకలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సూర్యకాంతం స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్, డాక్టర్ సూర్యకాంతం శతజయంతి కమిటీ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించగా, సూర్యకాంతం కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మురళీమోహన్, రేలంగి నరసింహారావు, తనికెళ్ల భరణి, అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకాంతంపై జర్నలిస్ట్ ఎస్పీ రామారావు రూపొందించిన ‘అత్తగారు జిందాబాద్’ లఘు చిత్రం ప్రదర్శించారు.

రాజు వెడ్స్ రామ్బాయి’ భావోద్వేగ ప్రేమకథ – వేణు ఊడుగుల

అఖిల్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రామ్బాయి’ చిత్రం నవంబర్ 21న విడుదల కానుంది. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను బన్నీవాస్ వర్క్స్, నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బన్నీ వాసు, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.

ప్రెస్‌మీట్‌లో బన్నీవాస్ మాట్లాడుతూ, “సినిమా మనసుకు హత్తుకునేలా ఉంది. ప్రేక్షకులు భావోద్వేగంతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు” అని అన్నారు. దర్శకుడు సాయిలు కంపాటి మాట్లాడుతూ, “ఖమ్మం, వరంగల్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను రాసాను. ‘ఆర్ఎక్స్ 100’, ‘ప్రేమిస్తే’, ‘బేబీ’ లాంటి గుర్తుండిపోయే ప్రేమకథగా ఇది నిలుస్తుంది” అని తెలిపారు.

సూపర్ స్టార్ కుటుంబం నుంచి కొత్త హీరోయిన్ – జాన్వీ స్వరూప్

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేశ్ బాబు మేనకోడలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. బుధవారం జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మంజుల ప్రకటించారు. “నా కుమార్తె హీరోయిన్‌గా రాబోతుండటం ఎంతో ఆనందంగా ఉంది. నన్ను అడ్డుకున్న వారే ఇప్పుడు జాన్వీ కోసం ప్రార్థిస్తున్నారు” అని ఆమె తెలిపారు.

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోయిన్‌గా తెరంగేట్రం చేయబోతున్న తొలి వారసురాలిగా జాన్వీ ప్రత్యేకత సంతరించుకుంది. షికారా స్టూడియోస్ ప్రొడక్షన్‌లో ఆమె నటించబోయే సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వీ బాలనటిగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

మెగా 158 హీరోయిన్‌పై మాళవిక మోహనన్ క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మెగా 158’ చిత్రంలో తానే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను నటి మాళవిక మోహనన్ ఖండించారు. సోషల్ మీడియాలో ఆమె, “చిరంజీవి గారితో నటించడం నా కల. కానీ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్‌లో భాగం కాదు” అని స్పష్టంచేశారు. దీంతో హీరోయిన్‌పై సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వస్తున్న ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

One thought on “PUBLIC TALK TV FILM NEWS : 30 అక్టోబర్ 2025 ఫిల్మ్ న్యూస్

  1. గుడ్ ఇన్ఫర్మేషన్… వెరీ గుడ్ న్యూస్ 😊👌👍👏👏👏👏💐💐👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *